: కలసి బతకలేక... పొలంలో పురుగు మందు తాగి తనువు చాలించిన ప్రేమికులు
కలసి బతకలేమని భావించిన ఆ జంట కనీసం కలిసైనా చనిపోవాలని కోరుకుంది. సమీపంలోని పొలాల్లోకి వెళ్లి తమతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి తనువు చాలించారు ఇద్దరు ప్రేమికులు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాచర్లకు చెందిన మక్కెన శ్రీనివాసరావు, బాపట్ల మండలం జుమ్మలపాలెంకు చెందిన యువతి ఝాన్సీలు చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాసరావు జుమ్మలపాలెంలో లైన్ మెన్ గా పనిచేస్తున్న సమయంలో వీరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలం పాటు సహజీవనం కూడా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏం సమస్య వచ్చిందో ఏమో, బైక్ పై మాచర్ల సరిహద్దుల్లోని పొలాల్లోకి వచ్చిన ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి వద్ద రెండు లేఖలు లభించాయి. వీటిల్లో ఒకటి అతని తల్లికి, మరొకటి సోదరికి రాసినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.