: నిధులు ఎన్ని వచ్చినా ప్రత్యేక హోదా ఉంటేనే... నేతలతో చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథి గృహంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం స్పందించిన తీరు పట్ల చర్చించారు. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా, ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రం పూడ్చాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలా కేంద్రం సాయం చేయాలని కోరారు. తన ఢిల్లీ పర్యటనలు ఏ రెండు మూడు ప్రాజెక్టుల కోసమో కాదని అన్నారు. సమన్యాయం, సమాన అవకాశాల కోసమే ఢిల్లీకి పలుమార్లు వెళ్లానని తెలిపారు. అభివృద్ధి కోసం నిద్రలేకుండా తాను తపిస్తుంటే, అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలని విపక్షం ఆలోచిస్తోందని మండిపడ్డారు.