: కృషి ఉంటే ఏదైనా సాధ్యమేనని చాటిన జంట
ప్రతి మనిషి బంగారు భవిష్యత్ కోసం కలలు కంటారు. అయితే దానిని సాధించేందుకు అవసరమైన ప్రయత్నం మాత్రం చేయరు. కొంత మంది ప్రయత్నం చేసినా మధ్యలోనే వదిలేస్తారు. కన్న కలలకోసం నూటికి నూరు శాతం కష్టపడితే అసాధ్యమైనా, సుసాధ్యమవుతుందని స్కాట్ లాండ్ లోని ఓ జంట చాటిచెప్పింది. స్కాట్ లాండ్ లోని డమ్ ఫ్రైస్ ప్రాంతంలోని బార్ హోల్మ్ అనే ఆరువందల ఏళ్ల నాటి పాడుపడిన ఓ కోటను జానెట్, జాన్ బ్రెన్నన్ దంపతులు 65వేల డాలర్లకు 1997లో కొన్నారు. దీనిని చూసిన చాలామంది వీళ్లకేమైనా పిచ్చా? అనుకున్నారు. ఈ భవంతిని 15 శతాబ్దంలో స్కాటిష్ నేజాన్ క్నాక్స్ రహస్య స్థావరంగా వినియోగించుకునేవారు. దీనిని రెనొవేట్ చేసుకుంటామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, నాలుగేళ్ల క్రితం అనుమతినిచ్చింది. దీంతో ఈ దంపతులు శ్రమించి, పాడుబడిన కోటను విలాసవంతమైన నాలుగు పడకగదులు, వంటగది, అద్భుతమైన లివింగ్ రూం కలిగిన భవంతిగా మర్చేశారు. పాత కోటను ఇలా తీర్చిదిద్దేందుకు ఆ దంపతులు వేలాది డాలర్లు ఖర్చు చేశారట. సర్వాంగ సుందరంగా ఉన్న ఈ భవనాన్ని కొనేందుకు ఔత్సాహికులు పోటీ పడుతున్నారట. దీని ధర ఏడు లక్షల డాలర్లు పలుకుతోందట.