: సునీల్ నరైన్ బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందా?
ఐపీఎల్ సీజన్-8లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందా? అంటే సరైన సమాధానం రావడం లేదు. ఐపీఎల్ కు ముందు నరైన్ కు బీసీసీఐ చెన్నైలోని బయోమెకానికల్ సెంటర్ లో పరీక్ష ఎదుర్కొన్నాడు. అక్కడ ఉత్తీర్ణత సాధించిన తరువాతే అతను ఐపీఎల్ లో పాల్గొంటున్నాడు. విశాఖపట్టణంలో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో నరైన్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడంటూ ఆన్ ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్టన్, వినీత్ కులకర్ణి ఐపీఎల్ గవర్నింగ్ బాడీకి ఫిర్యాదు చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో నరైన్ మరోసారి పరీక్ష ఎదుర్కోనున్నాడు. దీంతో కోల్ కతా జట్టులో ఆందోళన ప్రారంభమైంది. కోల్ కతా తురుపుముక్కగా నరైన్ ను ప్రత్యర్థులు భావిస్తారు. నరైన్ ను జాగ్రత్తగా ఆడుతూ, ఇతరులను టార్గెట్ చేస్తారు. అలాంటి నరైన్ జట్టుకు దూరమైతే పరుగులు ఎవరు కట్టడి చేస్తారోనని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.