: ప్రధాని మోదీని కలవనున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు
ఒలింపిక్ క్రీడలు నిర్వహించేందుకు భారత్ తహతహలాడుతోంది. 2024 ఒలింపిక్ క్రీడోత్సవానికి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ కూడా బిడ్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ ఒలింపిక్ బిడ్డింగ్ పై ఐఓసీలో భారత సభ్యుడు రణధీర్ సింగ్ మాట్లాడుతూ... భారత్ ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలు నిర్వహిస్తుండగా చూడాలని ఐఓసీ కూడా ఆకాంక్షిస్తోందని తెలిపారు. మోడీ, బాచ్ మధ్య చర్చల తీరును బట్టి భారత్ ఆతిథ్యమిచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయని అన్నారు. 2024లో కాకపోతే 2028లో చాన్స్ దక్కించుకుంటామని, అదీ కుదరకపోతే 2032లో అయినా ఆతిథ్యమిస్తామని ధీమాగా చెప్పారు. కాగా, 2010లో భారత్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన సందర్భంగా చోటుచేసుకున్న అవినీతి ప్రహసనం మోడీకి తెలియందికాదు. అటు, క్రీడాకారుల పరంగా భారత్ కు ఒలింపిక్స్ లో ఏమంత మంచి రికార్డు లేదు. పతకాలు కూడా కొద్ది సంఖ్యలోనే లభించాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బిడ్డింగ్ దాఖలు చేసే అంశంపై భారత్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.