: రైతు ఆత్మహత్యపై టీవీ ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టిన ఆప్ నేత
ఇటీవల ఢిల్లీలో తలపెట్టిన ర్యాలీలో గజేంద్రసింగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పార్టీపై వస్తున్న ఆ విమర్శలను, ఆరోపణలను హిందీ చానల్ ఆజ్ తక్ ఇంటర్వ్యూలో ఆప్ నేత ఆశుతోష్ తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో భావోద్వేగానికి లోనైన ఆప్ నేత అకస్మాత్తుగా ఏడ్చేశారు. ఇంతటి సున్నితమైన విషయాన్ని రాజకీయం చేయడం ఇక ఆపాలని, ఈ విధమైన వార్తా రచన చేయవద్దంటూ మీడియాను చేతులు జోడించి కోరారు. అయితే అదే టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైతు గజేంద్ర సింగ్ కుమార్తె మేఘా(17) మాట్లాడుతూ, తన తండ్రి వద్ద దొరికిన నకిలీ ఆత్మహత్య లేఖ ఎవరు రాశారు? తన తండ్రిని అందుకు ఎవరు ప్రేరేపించారు? అని సూటిగా ప్రశ్నించింది. స్పందించిన ఆప్ నేత, "నేను నిందితుడిని మేఘా. నీ తండ్రి మరణాన్ని ఆపలేకపోయాను" అని ఆవేదన వ్యక్తం చేశారు.