: పంచాయతీల్లో 'సర్పంచ్ భర్త' సంస్కృతి నశించాలి: మోదీ
మహిళల సాధికారత లక్ష్యంగా పంచాయతీల్లో సర్పంచ్ బాధ్యతలను మహిళలు నిర్వర్తించేలా ప్రోత్సహిస్తుంటే ఎక్కడికక్కడ 'సర్పంచ్ భర్త'ల సంస్కృతి పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా, న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మహిళలు సర్పంచ్ లుగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి బాధ్యతనంతా వారే నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలన్న గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఆయన మాటలను గౌరవించి, పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తదుపరి పదేళ్లలో ఏం సాధించాలో లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి కోసం కృషి చేయాలని అన్నారు. గ్రామీణ భారతావనిలో బడికివెళ్లని చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉండడం కలవరపెడుతోందని, బడిఈడు పిల్లలందరినీ బడికి పంపే బాధ్యతను ఆయా గ్రామాల ప్రజలే తీసుకోవాలని సూచించారు.