: ఆ యాడ్ ను నిషేధించాల్సిందే... సైనికులకు అవమానకరం: బీజేపీ ఎంపీ చింతామణి
ఇటీవల కాలంలో టెలివిజన్ స్క్రీన్లపై బాగా ప్రజాదరణ పొందిన అడ్వర్టయిజ్ మెంట్లలో ఫెవిక్విక్ వాఘా బోర్డర్ యాడ్ ఒకటి. అందులో, 'బీటింగ్ ద రిట్రీట్' కార్యక్రమంలో భాగంగా ఓ భారత జవాను, ఓ పాకిస్థాన్ జవాను కదం తొక్కుతూ ఎదురెదురుగా నిల్చుంటారు. అప్పుడు ఇరువురు కాలెత్తి ఆధిక్యత ప్రదర్శించే సమయంలో, పాక్ జవాను బూటు అడుగుభాగం వ్రేలాడుతూ కనిపిస్తుంది. అది గమనించిన భారత్ జవాను, పాక్ జవానును అప్రమత్తం చేస్తాడు. కానీ, నిస్సహాయుడైన పాక్ జవాను భారత జవానువైపు దీనంగా చూస్తాడు. దీంతో, కరిగిన భారత సైనికుడు వెంటనే జేబులోంచి ఫెవిక్విక్ ట్యూబు తీసి బూటును అతికించేస్తాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఇలా ఉంటుంది ఆ యాడ్. ఈ ప్రకటనలో కనబర్చిన సృజనాత్మకతకు బాగానే గుర్తింపు లభించింది. అయితే, ఆ వాణిజ్య ప్రకటన జాతి వ్యతిరేకమంటున్నారు బీజేపీ ఎంపీ చింతామణి మాలవ్య. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ... సైనికులకు అది అవమానకరమని పేర్కొన్నారు. అంతేగాకుండా, ఆ యాడ్ డైరెక్టర్, రైటర్, రూపకర్తలపై దేశద్రోహ నేరం కింద విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు. కాగా, ఈ వాణిజ్య ప్రకటనను ప్రఖ్యాత యాడ్ ఏజెన్సీ 'ఓగ్లివీ అండ్ మేథర్' రూపొందించింది.