: కామధేను నగర్... మనుషుల కోసం కాదు!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కొత్త బాధ్యతలను తలకెత్తుకుంది. హిందుత్వంలో అతి పవిత్రంగా భావించే గోవుల సంరక్షణకు నడుం బిగించింది. వాటి కోసం దేశవ్యాప్తంగా 'కామధేను నగర్' పేరిట 120 ప్రత్యేక ఆవాసాలు నిర్మించేందుకు సంకల్పించింది. జనావాసాలకు అనుబంధంగానే ఈ కామధేను నగర్ లను ఏర్పాటు చేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వీటికి అనుబంధంగా 80 'గోకుల్ గురుకుల్' పాఠశాలలు కూడా నడపాలని నిర్ణయించింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారతీయ గో సేవ అధ్యక్షుడు శంకర్ లాల్ దీని గురించి వివరిస్తూ... దైనందిన జీవితంలో ఆవు కూడా ఓ భాగం అయినప్పుడే దాన్ని రక్షించగలమని తెలిపారు. స్థలం కోసం గేటెడ్ కమ్యూనిటీ, కాలనీలతో ఈ విషయమై చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఈ గోశాలల ద్వారా పాలు, పాల పదార్థాలు, ఔషధాలు, గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి ఆయా కాలనీలకు అందిస్తామని, ప్రతిగా, కాలనీలు కామధేను నగర్ బాధ్యతల్లో సాయపడతాయని ఆయన వివరించారు. సంఘ్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 100కు పైగా అనువైన స్థలాలను గుర్తించింది. ఇక, ఆవు పాలు తాగడం ద్వారా మనుషుల్లో సాత్వికత పెంపొందుతుందని, తద్వారా క్రైమ్ రేటు తగ్గుతుందని శంకర్ లాల్ పేర్కొన్నారు. నేర రహిత భారత్ కోసం పిల్లలు భారత గోవుల పాలు మాత్రమే తాగాలని ఆయన పిలుపునిచ్చారు.