: నింగినేలుతున్న ఇండిగో!
ఇండియాలో రోజురోజుకూ విమానాల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండగా, ప్రభుత్వరంగ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా, ప్రైవేటు రంగంలోని జెట్ ఎయిర్ వేస్ తదితరాలను పక్కనబెట్టి బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఇండిగో అత్యధిక వాటాను సొంతం చేసుకుంది. మిగతా కంపెనీలకు అందనంత దూరంలో, నింగిలో రాజుగా నిలిచింది. గడచిన ఫిబ్రవరిలో దేశవాళీ ఎయిర్ ట్రాఫిక్ 21 శాతం పెరిగింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు గత సంవత్సరంతో పోలిస్తే 8 శాతం వరకూ ప్రయాణికుల వృద్ధిని చూశాయి. టిక్కెట్ల ధరలు తగ్గడంతో మరింతమంది విమానయానం వైపు మొగ్గు చూపారు. దీంతో వరుసగా మూడవ నెలలోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. మార్చిలో 52 లక్షల మంది విమాన ప్రయాణం చేయగా, ఏప్రిల్ లో ఆ సంఖ్య 62 లక్షలకు పెరిగింది. మొత్తం ప్రయాణికుల్లో 36.4 శాతం (సుమారు 22.56 లక్షలు) మంది ఇండిగో విమానాల్లో ప్రయాణాలు సాగించారు. రెండో స్థానంలో జెట్ ఎయిర్ వేస్ అనుబంధ సంస్థ జెట్ లైట్ 25.4 శాతం వాటాతో, ఎయిర్ ఇండియా 16.9 శాతం వాటాను పంచుకున్నాయి. మొత్తం మీద గత సంవత్సరంతో పోలిస్తే పాసింజర్ వృద్ధి 21 శాతం పెరిగిందని గణాంకాలు చూపుతున్నాయి.