: 'లగాన్' జట్టుగా... టీ టీడీపీ టీం: చంద్రబాబు సభలో ఆకట్టుకున్న పోస్టర్!


భారత చలనచిత్ర రికార్డులను తిరగరాసిన 'లగాన్' చిత్రం గుర్తుందిగా? బాలీవుడ్ మిస్టర్ పెర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన ఈ చిత్రం దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ చిత్రంలో ఆమిర్ కెప్టెన్సీలో జట్టుగా ఏర్పడ్డ భారతీయులు, బ్రిటిషర్లతో జరిగే క్రికెట్ మ్యాచ్ లో విజయం సాధించి తెల్లదొరల పాలనకు చరమగీతం పాడతారు. అసలు ఆ చిత్రంతో ఇప్పుడేం పని అనుకుంటున్నారా? నిన్న మహబూబ్ నగర్ లో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు సభకు వెళ్లి ఉంటే, ఇప్పటికే మీకు విషయం అర్థమయ్యేది. సభా ప్రాంగణంలో టీడీపీ నేత ఒకరు 'లగాన్' పోస్టర్ ను ఏర్పాటు చేశారు. అయితే పోస్టర్ లో ఆమిర్ జట్టు సభ్యులు లేరు. గెటప్ లు వారివే అయినా, ముఖాలు మాత్రం టీ టీడీపీ నేతలవి. ఆమిర్ పాత్రలో టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఉంటే, ఆయన పక్కనే మిగిలిన జట్టు సభ్యులుగా రేవంత్ రెడ్డి, మాగంటి గోపీనాధ్, మాధవరం కృష్ణారావు, ఆరికెపూడి గాంధీ తదితర టీ టీడీపీ ఎమ్మెల్యేలు కనిపించారు. ఇక టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫొటో కూడా అందులో దర్శనమిచ్చింది. సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ పోస్టర్ ను ఆసక్తిగా తిలకించారు.

  • Loading...

More Telugu News