: బాలీవుడ్ లోకి సచిన్ తనయ సారా?... షాహిద్ కపూర్ తో జోడీ కడుతోందట!
భారతరత్న అవార్డు గ్రహీత, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండూల్కర్ గారాల పట్టి సారా బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేయనుందట. బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్ తో కలిసి ఆమె తన తొలి చిత్రంలో నటించనుందట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లోనే కాక దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. ముంబైలోని ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యనభ్యసిస్తున్న 18 ఏళ్ల వయస్సున్న సారా, చూడటానికి అచ్చం సినిమా హీరోయిన్ లాగే కనిపిస్తోందని బాలీవుడ్ జనాలు చెబుతున్నారు. తన తండ్రి మైదానంలో ఉంటే.. తల్లి, తమ్ముడితో కలిసి సారా అప్పుడప్పుడూ మ్యాచ్ లు చూసేందుకు వచ్చేది. ఇటీవలి ఐపీఎల్ మ్యాచ్ లలోనూ ఆమె పలుమార్లు క్రికెట్ స్టేడియాల్లో కనిపించింది. ఇలా మ్యాచ్ లు చూసేందుకు స్టేడియంకు వచ్చిన సారాను చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెను సినిమాల్లోకి పంపాలని సచిన్ ముందు ప్రతిపాదించారట. అయితే సారాను సినిమాల్లోకి పంపేందుకు సచిన్ సుముఖంగా లేరని అతడి సన్నిహితులు చెబుతున్నారు. భార్య లాగే కూతురును కూడా వైద్యురాలిగానే చూడాలని సచిన్ భావిస్తున్నారు. అలా కాని పక్షంలో తన వ్యాపారాలన్ని ఆమె చేతిలో పెట్టేందుకూ సచిన్ నిర్ణయించుకున్నారని విశ్వసనీయ సమాచారం.