: నేడు స్వదేశానికి మల్లి మస్తాన్ బాబు భౌతిక కాయం... రాత్రికి స్వగ్రామానికి!
ఔత్సాహిక పర్వతారోహకుడు, పర్వతారోహణలో గిన్నిస్ రికార్డు సృష్టించిన తెలుగు తేజం మల్లి మస్తాన్ బాబు మృతదేహం ఎట్టకేలకు నేడు స్వదేశానికి రానుంది. నేటి ఉదయం 9 గంటలకు ఢిల్లీ చేరనున్న మస్తాన్ బాబు భౌతికకాయాన్ని నేటి రాత్రిలోగా ఆయన స్వగ్రామం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గాంధీ జనసంఘానికి చేర్చనున్నట్లు అధికారులు చెబుతున్నారు. చిలీలోని ఆండీస్ పర్వతారోహణకు వెళ్లిన మస్తాన్ బాబు అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మంచు కొండల్లోనే తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మస్తాన్ బాబు మృతదేహాన్ని కనుగొనేందుకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత ఆయన భౌతిక కాయాన్ని భారత్ కు తరలించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు నేడు ఆయన భౌతికకాయం స్వగ్రామం గాంధీ జనసంఘానికి చేరనుంది. రేపు ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.