: పొట్టేలు-మహిళ ఉదంతం చెప్పిన చంద్రన్న
మహబూబ్ నగర్ సభలో చంద్రబాబునాయుడు తాను పాదయాత్ర చేసినప్పటి అనుభవాన్ని పంచుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో వెళుతుండగా... ఓ మహిళ, ఆమె వెనుక ఓ పొట్టేలు వెళుతూ కనిపించారని వివరించారు. ఆమెను ఆపి, "పొట్టేలు నీ వెనుకే ఎలా వస్తోందని అడిగాను. నువ్వు ఎటు వెళితే అది కూడా అటే వస్తోంది, ఏమైనా మంత్రం వేశావా? అని అడిగాను. అందుకామె ఇలా బదులిచ్చింది. తాను దానికి కేవలం గడ్డి మాత్రమే పెట్టానని, అందుకే తాను ఎటు వెళితే అటు వస్తోందని వివరించింది" అని బాబు చెప్పారు. కేవలం గడ్డి తిన్న పొట్టేలు అంత విశ్వాసం చూపిస్తోందని, కానీ, కార్యకర్తలుగా ఉన్న వ్యక్తులను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మలిచానని, కానీ వారు పార్టీని వీడి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి తలచుకుంటే ఎంతో బాధేస్తుందని అన్నారు. అంతలోనే తమాయించుకుని, నేతలు పోతే మరో వందమందిని తయారుచేసుకుంటామని ధీమాగా చెప్పారు.