: కడుపా?...ఇనుప సామాన్ల కొట్టా?: ఆశ్చర్యపోయిన వైద్యులు


కడుపునొప్పితో బాధపడుతున్న రోగిని పరీక్షించిన వైద్యులు అవాక్కైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పంజాబ్ లోని బటిండా ప్రాంతానికి చెందిన రైతు రాజ్ పాల్ సింగ్ (34) తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేవాడు. దీంతో వైద్యులను సంప్రదించడం, వారు మందులివ్వడం తాత్కాలిక ఉపశమనం కలగడం, మళ్లీ కడుపునొప్పి అతనిని పలకరించడం, దీంతో అతను మరో డాక్టరును సంప్రదించడం అలవాటైపోయింది. దీంతో విసుగు చెందిన రాజ్ పాల్ స్థానికంగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గగన్ దీప్ గోయల్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అతని కడుపుని ఎండోస్కొపీ చేసిన వైద్యుడు షాక్ కు గురయ్యాడు. అది కడుపా, లేక ఇనుప సామాన్ల కొట్టా? ఇన్ని ఇనుప సామాన్లు కడుపులోకి ఎలా వెళ్లాయంటూ గద్దించారు. దీంతో రాజ్ పాల్ కడుపులోని ఇనుప సామాన్ల గుట్టు విప్పాడు. మానసిక ఒత్తిడి కారణంగా మూడేళ్ల క్రితం చచ్చిపోదామని భావించి ఇనుప వస్తువులు మింగాడట. అప్పటి నుంచి ఇనుప వస్తువులు మింగకపోతే వెలితిగా ఉండేదని, నేరుగా మింగడం కష్టంగా అనిపించడంతో పాలతో, పండ్ల రసాలతో కలిపి వాటిని మింగేవాడినని చెప్పాడు. ఇనుప సామాన్ల గురించి ఎవరికీ చెప్పకపోవడంతో వైద్యులు అతనికి మామూలు మందులు ఇచ్చేవారట. దీంతో అతనికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు నట్లు, బోల్టులు, బ్యాటరీలతో పాటు 140 నాణేలు, 150 మేకులు బయటికి తీశారట. ఇంకా కొన్ని సామాన్లు మిగిలిపోయాయని, వాటిని తీయాలంటే మరో ఆపరేషన్ చేయాలని, అలా చేస్తే అతనికి ప్రమాదమని, అతను కోలుకున్నాక మరోసారి ఆపరేషన్ చేసి వాటిని తీస్తామని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News