: ఓ వైపు వడగళ్లు, మరోవైపు పిడుగులు... బెంబేలెత్తిన గుంటూరు జిల్లా
ఈ సాయంత్రం గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం ప్రజా జీవనాన్ని ఆటంకపరిచింది. గురజాల, కారంపూడి, దుర్గి, మాచర్ల మండలాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. కారంపూడి మండలంలో పిడుగులు పడి ఒక వ్యక్తి మరణించగా, మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. వడగళ్ల వానతో వాహనాల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ఇదిలావుండగా, మరోవైపు తిరుమల గిరులు సైతం భారీ వర్షంలో తడిసి ముద్దయ్యాయి. కొండపై గంటకు పైగా వర్షం పడడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఈ ఉదయం వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.