: వాలెంటైన్స్ డే బహిష్కరణ!: విహెచ్పీ, భజరంగ్ దళ్
భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలకు భంగకరంగా మారిన వాలెంటైన్స్ డేను బహిష్కరిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ లు ప్రకటించాయి. ఫిబ్రవరి 14న పార్కులు, రోడ్లపై తిరిగే ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేస్తామని ఆ సంస్థలు హెచ్చరించాయి. తాము ప్రేమకు వ్యతిరేకం కాదని, ప్రేమ పేరుతో విశృంఖలత్వం పెరగడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని వీహెచ్పీ నేతలు తెలిపారు.
వాలంటైన్స్ డే రోజు యువతను పెడదోవ పట్టించే విధంగా హోటళ్లు, పబ్బులు, రిసార్టుల్లో జరిగే వివిధ రకాల కార్యక్రమాలను అడ్డుకుంటామని నిర్వాహకులకు ఇప్పటికే హెచ్చరించామని తెలిపారు. అలాగే ప్రేమికుల రోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకూడదని హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.