: ఆమ్ ఆద్మీ ప్రోద్బలంతోనే గజేంద్ర ఆత్మహత్య: ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రోద్బలంతోనే గజేంద్ర సింగ్ అనే రైతు ఢిల్లీలో అత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం, ర్యాలీ సమీపంలో ఎస్ఎస్ యాదవ్ అనే పోలీసు అధికారి విధులను నిర్వహిస్తున్నారు. ఆత్మహత్య ఘటనను చూసి వెంటనే కంట్రోల్ రూంకు తెలియజేశారు. ఆ సమయంలో ఆంబులెన్స్ కు దారి ఇవ్వాలని కోరితే, ఆప్ కార్యకర్తలు తమ సభ సజావుగా సాగేందుకు పోలీసులు సహకరించడం లేదంటూ, నినాదాలు చేశారు. ఫైరింజన్ వాహనం ఆ చెట్టు దగ్గరికి చేరుకునేందుకు ఆప్ కార్యకర్తలు దారి వదల్లేదు. గజేంద్ర ఆత్మహత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్టు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు.