: విజయమాల్యాకు మరో ఎదురుదెబ్బ... యునైటెడ్ స్పిరిట్స్ సీఎఫ్ఓ మురళి రాజీనామా!
యునైటెడ్ స్పిరిట్స్ లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరుగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా పనిచేస్తున్న పి.ఎ.మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని యునైటెడ్ స్పిరిట్స్ నేడు ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన రాజీనామాను బోర్డు డైరెక్టర్లు ఆమోదించారని తెలిపిన సంస్థ, రాజీనామాకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. యునైటెడ్ స్పిరిట్స్ అనుబంధ సంస్థల్లోనూ ఆయన అనుభవిస్తున్న పదవులకు రాజీనామా చేశారని తెలిపింది. కాగా, లిక్కర్ కింగ్ విజయమాల్యాకు దగ్గరి వ్యక్తిగా, మూడు నాలుగేళ్ల క్రితం ఆర్థిక కష్టాలను తొలి దశలోనే గుర్తించి, నిధుల సమీకరణలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన మురళి రాజీనామాతో మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.