: ఏం చెబుతుంది?... అందరి కళ్లూ ఇన్ఫోసిస్ పైనే!
నాలుగో త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రేపు వెల్లడించనున్న నేపథ్యంలో ఐటీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఫలితాలు వెల్లడించిన టీసీఎస్, హెచ్ సీఎల్, విప్రో సంస్థల గణాంకాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయిన నేపథ్యంలో ఇన్ఫీ మీదనే ఇన్వెస్టర్లు ఆశలు పెట్టుకున్నారు. సమీప భవిష్యత్తులో ఐటీ సెక్టారు కంపెనీల గమనాన్ని ఇన్ఫీ శాసించే అవకాశాలు ఉండడంతో అందరి కళ్లూ సంస్థపైనే ఉన్నాయి. ఈ రంగంలోని కంపెనీల ఫలితాలు సీఎన్ఎక్స్ ఐటీ ఇండెక్స్ ను ఇప్పటికే 11,406 పాయింట్లకు దిగజార్చాయి. జనవరి తరువాత ఐటీ ఇండెక్స్ ఇంత తక్కువ స్థాయికి రావడం ఇదే తొలిసారి. గడచిన ఆరు సెషన్లలో నిఫ్టీ సూచి 5 శాతం దిగజారితే, ఐటీ సెక్టారు ఏకంగా 7.4 శాతం నష్టపోయింది. కాగా, రేపు ఫలితాలను వెల్లడించనున్న ఇన్ఫోసిస్ ఈక్విటీ నేటి సెషన్లో ఒత్తిడికి లోనయింది. ఇన్వెస్టర్లు వాటాల అమ్మకానికే ప్రాధాన్యం ఇవ్వడంతో ఈక్విటీ విలువ 0.8 శాతం పడిపోయింది.