: సింగరేణిలో కార్మిక నేతల కక్కుర్తి... కార్మికుల సొమ్ము నొక్కేసిన టీఆర్ఎస్ అనుబంధ సంఘం నేతలు
సింగరేణి కాలరీస్ లో భారీ అవినీతి చోటుచేసుకుంది. కార్మికుల సంక్షేమం కోసం పోరు సాగించే గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి పోగైన నిధిని కార్మిక సంఘం నేతలు కొల్లగొట్టేశారు. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగం 'తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం' (టీబీజీకేెఎస్) నేతలు ఈ కక్కుర్తికి పాల్పడటం విశేషం. టీఆర్ఎస్ పుణ్యంతో ఇటీవలే సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికైన టీబీజీకేఎస్ నేతలు గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా రూ.91 లక్షలను కొట్టేశారు. సింగరేణి అధికారులతో కుమ్మక్కైన టీబీజీకేఎస్ నేతలు ఆకునూరి కనకరాజు, మిర్యాల రాజిరెడ్డి, సారంగపాణిలు ఈ నయా దందాకు పాల్పడ్డారు. ఇదివరకే ఈ అవినీతి భాగోతం వెలుగు చూడగా, నిన్న పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు ముగ్గురు నేతలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ అవినీతి తిమింగలాలకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిజామాబాదు ఎంపీ కవిత ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్మిక సంఘం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం, ఆ ఆరోపణలు నిజమని తేలడంతో టీఆర్ఎస్ కాస్త ఇరకాటంలో పడిపోయింది. అయితే అవినీతిని ఎంతమాత్రం సహించేది లేదని చెబుతున్న కవిత, వీరిపై త్వరలోనే వేటు వేస్తారని ప్రచారం సాగుతోంది.