: చైనాలో బయటపడ్డ డజన్ల కొద్దీ డైనోసార్ గుడ్లు
చైనాలోని హేయువాన్ అనే నగరంలో నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరుగుతుండగా, డజన్ల కొద్దీ డైనోసర్ల గుడ్లు శిలాజాల రూపంలో బయటపడ్డాయి. మొత్తం 43 గుడ్లు వెలుగుచూశాయని చైనా అధికార న్యూస్ ఏజన్సీ 'క్సిన్హువా' వెల్లడించింది. వీటిల్లో 19 గుడ్లు చెక్కు చదరలేదని, అయితే, ఇవి ఏ రకం డైనోసార్ గుడ్లో తెలియడం లేదని వివరించింది. వీటిల్లో ఒక గుడ్డు 13 సెంటీమీటర్ల పొడవుందని పేర్కొంది. వీటన్నింటినీ మ్యూజియంకు తరలించి భద్రపరుస్తామని అధికారులు తెలిపారు. హేయువాన్ పరిసరాల్లో గత 25 సంవత్సరాలుగా వేలాది డైనోసర్ గుడ్ల శకలాలను పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటివరకూ 10,008 డైనోసార్ గుడ్లను దాచి ఉన్నందుకుగాను హేయువాన్ మ్యూజియం గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. ఇవి సుమారు 6.5 కోట్ల నుంచి 8.9 కోట్ల సంవత్సరాల కిందటివని సమాచారం. ఈ గుడ్లు ఓవిరాప్ట్రాయిడ్ రకం డైనోసార్లవని గిన్నిస్ బుక్ వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాలు తెలియజేస్తున్నాయి.