: నింగీ, నేల మాత్రమే కాదు.. నీటిలోనూ మహిళలకు వేధింపులు: కర్ణాటకలో స్కూబా శిక్షకుడి అరెస్ట్
మహిళలపై అకృత్యాలకు అడ్డే లేకుండా పోతోంది. నడిరోడ్లపైనే కాక ఆకాశయానంలోనూ మృగాళ్లు మహిళల వెంటబడుతుంటే, తాజాగా ఓ దుర్మార్గుడు నీటిలోనూ పేట్రేగిపోయాడు. స్కూబా డైవింగ్ నేర్చుకునేందుకు వచ్చిన మహిళా టెక్కీపై అతడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. రెండు నెలల క్రితం కర్ణాటకలోని ఉత్తర కన్నడలోని మురుదేశ్వర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో అరెస్టైన అతడు ఆ తర్వాత దర్జాగా బెయిల్ పై విడుదలయ్యాడు. డ్రీమ్జ్ డైవింగ్ సంస్థలో శిక్షకుడిగా పనిచేస్తున్న ధీరేంద్ర రావత్, ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మహిళా టెక్కీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కళ్లకు కట్టినట్టు వివరించింది. సముద్రంలో బాగా లోతుకు తీసుకెళ్లిన రావత్, బాధితురాలి ప్రాణ వాయువును తన కంట్రోల్ లో ఉంచుకుని ఇష్టారాజ్యంగా ఆమెపై చేతులేశాడట. ఎదురుతిరిగితే... ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తూ, మళ్లీ పునరుద్ధరిస్తూ రాక్షసానందం పొందాడట. తీరా ఒడ్డుకు చేరుకున్న తర్వాత బాధితురాలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అంతకుముందు కూడా రావత్ మరో ఇద్దరు మహిళలపై ఈ తరహాలోనే అకృత్యానికి పాల్పడ్డాడని తేలింది. ఉడిపి పర్యటనకు వచ్చే పర్యాటకులను స్కూబా డైవింగ్ పేరిట మారుమూల తీర ప్రాంతాలకు తీసుకెళ్లే రావత్, ఈ తరహా దారుణాలకు ఒడిగడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు.