: వలసల నివారణకు రంగంలోకి దిగిన చంద్రబాబు... పాలమూరు పర్యటన షురూ!


రాష్ట్ర విభజన నాటి నుంచి తెలంగాణలో టీడీపీకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎన్నికలు ముగిసి టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఆ తరహా అనుభవాల పరంపర నిత్యకృత్యమైంది. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. పార్టీ నేతలను నిలువరించేందుకు చంద్రబాబుతో పాటు చినబాబు లోకేశ్ చేస్తున్న యత్నాలు కూడా ఫలించడం లేదు. దీంతో ఇక జిల్లాల పర్యటనలే బెటరంటూ చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వరంగల్ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు తాజాగా కొద్దిసేపటి క్రితం పాలమూరు జిల్లా పర్యటనకు బయలుదేరారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా టీడీపీకి పెట్టని కోటే. 13 నియోజకవర్గాలుంటే, 12 స్థానాలు ఆ పార్టీవే. అయితే సీన్ రివర్సైంది. ప్రస్తుతం జిల్లాలో రెండు సీట్లకే టీడీపీ పరిమితమైంది. కేడర్ మాత్రం పార్టీని వీడలేదట. ఈ నేపథ్యంలో కేడర్ లో ఉత్సాహం నింపడం ద్వారా పార్టీ ఫిరాయింపులను నిరోధించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పాలమూరు జిల్లా పర్యటనకు రూపకల్పన చేశారు. నేటి మధ్యాహ్నం మహబూబ్ నగర్ చేరుకునే చంద్రబాబు రాత్రి దాకా అక్కడే ఉంటారు. పార్టీ కార్యకర్తలతో చర్చలు జరిపే ఆయన, ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులను సమీక్షిస్తారు. చంద్రబాబు పర్యటనతో జిల్లాలోని పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం రావడం ఖాయమని టీ టీడీపీ నేతలు భావిస్తున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జిల్లాకు చెందిన కీలక నేత రేవంత్ రెడ్డి 10 వేల బైకులతో ప్రత్యేక ర్యాలీని ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News