: ఎవరిదీ పాపం?... రైతు ఆత్మహత్యపై కదిలిన కేంద్రం... మోదీతో రాజ్ నాథ్ చర్చలు
వందలాది మంది చూస్తుండగానే, రాజస్థాన్ కు చెందిన రైతు ఢిల్లీ వీధుల్లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించగా, ఈ విషయంలో ఎవరిపై కేసు నమోదు చేయాలో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు. ఈ ఉదయం ప్రధాని మోదీని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కలిశారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై తన వద్ద ఉన్న సమాచారాన్ని రాజ్ నాథ్ సింగ్ స్వయంగా మోదీకి తెలియజేశారు. పోలీసులు తీసుకున్న చర్యలను వివరించారు. రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే, అక్కడే ఉన్న ఆప్ నేతలు తమ ప్రసంగాలు కొనసాగించారే తప్ప, ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న రైతు గజేంద్ర సింగ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో ముగిశాయి. కాగా, నేటి పార్లమెంట్ సెషన్లో రైతు ఆత్మహత్యపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. ఈ అంశంపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్ ప్రకటించారు. మధ్యాహ్నం చర్చిద్దామని సభ్యులకు తెలిపారు. కాంగ్రెస్ తదితర విపక్షపార్టీలు మాత్రం తక్షణం చర్చకు అనుమతించాలని పట్టుబడుతున్నారు.