: రష్యా మిలటరీకి భంగపాటు!
ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగిన దేశాల్లో ఒకటిగా ఉన్న రష్యా మిలటరీ ఒక క్షిపణి ప్రయోగం విషయంలో విఫలమై భంగపడింది. ఆ దేశ సైనికాధికారులు దగ్గరుండి మరీ పరీక్షించిన క్షిపణి ప్రయోగించిన సెకన్లలోనే కుప్పకూలి పేలిపోయింది. దీంతో మిలటరీ అధికారులు అవాక్కయ్యారు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల 'ఆంతే మిసైల్-2500'ను ప్లీసెస్క్ మిలటరీ కాస్మోడ్రోమ్ వద్ద పరీక్షించగా, విఫలమైంది. 2500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి ఇప్పటికే సైన్యంలో ఉన్న ఎస్-300ను అభివృద్ధి చేసి తయారుచేశారు. ప్రయోగించిన అనంతరం కేవలం 7 కి.మీ దూరం వెళ్లి మిసైల్ కుప్పకూలినట్టు తెలిసింది. క్షిపణి శకలాలు సమీప ప్రాంతాల్లోనే పడిపోయాయని, ప్రయోగం విఫలం కావడానికి కారణాలను అన్వేషిస్తున్నామని సైన్యాధికారులు తెలిపారు. గతంలో ఎస్-300 క్షిపణులను రష్యా ఇరాన్ కు విక్రయించింది.