: పాకిస్థాన్ పుండుపై కారం రాసిన బంగ్లాదేశ్!
అసలే వరల్డ్ కప్ వైఫల్యం తరువాత సిగ్గుతో చచ్చి బతుకుతున్న పాకిస్థాన్ ను మూడు మ్యాచ్ లలో ఓడించి, 3-0తో సిరీస్ ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేయడం ద్వారా పుండుపై కారం రాసినట్లయింది. బంగ్లా టైగర్లు తొలిసారిగా ఒక సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం, అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై కావడంతో ఆ దేశంలో క్రీడాభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇటీవలి వరల్డ్ కప్ లో సైతం బంగ్లాదేశ్ రాణించి క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు పాక్ పేలవ ప్రదర్శనపై ఆ దేశంలో అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఆటగాళ్ల ఇళ్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో, ప్రముఖ ఆటగాళ్ల ఇళ్ల వద్ద బందోబస్తు పెంచినట్టు తెలుస్తోంది. కాగా, ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం నాడు టీ-20 మ్యాచ్ జరగనుంది.