: ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏంటి?: విమానం నడిపేందుకు నిరాకరించిన ఎయిర్ ఇండియా పైలెట్
మరికాసేపట్లో ఎయిర్ ఇండియా విమానం 467 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి కొచ్చి వెళ్లాల్సివుండగా, పైలెట్ బాంబు పేల్చాడు. కాక్ పిట్ లో ఉన్న ఆక్సిజన్ మాస్క్ శుభ్రంగా లేదని ఆరోపిస్తూ, విమానం నడిపేందుకు నిరాకరించాడు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ మాస్క్ తనకు అవసరపడితే, దాన్ని వాడేందుకు వీలుగా లేదన్నది ఆ పైలెట్ వాదన. విమానాన్ని నడిపేందుకు ససేమిరా అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో విమానం 3 గంటలకు పైగా నిలిచిపోగా, వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమానంలోని ఎయిర్ హోస్టెస్లు మాస్క్ ను కోలిన్ తో శుభ్రం చేసినా పైలెట్ వినలేదు. చిన్న కారణంతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టవద్దని ఎయిర్ ఇండియా అధికారులు కోరినా, తన పట్టు వీడలేదు. ఈ ఘటన ఇతర సర్వీసులపైనా ప్రభావం చూపింది. దీనిపై ఏఐ చైర్మన్ రోహిత్ నందన్ సీరియస్ అయ్యారు. ఇటువంటి సిల్లీ రీజన్స్ చెప్పి విమానాల రాకపోకలను ఆలస్యం చేస్తే సహించబోనని వార్నింగ్ కూడా ఇచ్చారట. మొత్తం ఘటనపై విచారించి నివేదిక ఇవ్వాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.