: మరో ‘ప్రైవేట్’ రోడ్ టెర్రర్... లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, 30 మందికి తీవ్ర గాయాలు
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. ముందుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయబోయిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, బస్సులోని ప్రయాణికుల్లో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే, యానాం నుంచి హైదరాబాదు బయలుదేరిన శ్రీ సూర్యా ట్రావెల్స్ బస్సు, దాదాపుగా గమ్యస్థానం చేరుకుంది. మరో అరగంట ఉంటే ప్రయాణికులంతా బస్సు దిగేసేవారే. హైదరాబాదు నగర శివారు హయత్ నగర్ మండలం బాట సింగారం వద్ద నేటి తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ముందుగా వెళుతున్న లారీని బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో లారీని బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ తో పాటు బస్సులోని 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన హయత్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.