: సాగు భూముల్లో రాజధాని నిర్మాణం సరికాదు: చంద్రబాబుకు అన్నా హజారే లేఖాస్త్రం
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి లేఖాస్త్రం సంధించారు. రాజధాని నిర్మాణం కోసం పంటలు పండే భూములను సేకరించడం సరికాదని ఆయన ఆ లేఖలో చంద్రబాబుకు సూచించారు. రాష్ట్ర విభజన, ఆర్థిక లోటు తదితరాలు తనకు తెలుసంటూనే... ఏడాదికి రెండు, మూడు పంటలు పండే బంగారం లాంటి భూముల్లో రాజధాని నిర్మాణం అభిలషణీయం కాదని సుతిమెత్తగా చురకలంటించారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా వ్యవహరించవద్దని ఆయన చంద్రబాబును కోరారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో పర్యటించిన సామాజిక ఉద్యమకారులంతా... ప్రభుత్వం అక్కడి రైతులను భయపెట్టి, రాజధాని నిర్మాణం కోసం బంగారం లాంటి భూములను బలవంతంగా సేకరించిందని చెబుతున్నారన్నారు. అదే జరిగి ఉంటే, వెంటనే రైతులకు వారి భూములను తిరిగి ఇచ్చేయాలని సూచించారు. త్వరలోనే అమరావతిలో పర్యటిస్తానని చెప్పిన ఆయన... అక్కడి రైతులు, రైతు కూలీలతో ముఖాముఖిగా భేటీ అవుతానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.