: భూసేకరణ బిల్లుపై ఢిల్లీలో ఆప్ ర్యాలీ... అదే ర్యాలీలో ఓ రైతు ఆత్మహత్య
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందులో ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, హర్యానా, పంజాబ్, ఒడిశా, బుందేల్ ఖండ్, పూర్వాంచల్ బెల్ట్ పరిధి నుంచి దాదాపు వెయ్యి మంది రైతులు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తుండటతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ వైపు లోక్ సభ సమావేశాలు జరుగుతుండగా జంతర్ మంతర్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ ర్యాలీలో ఓ విషాదం చోటుచేసుకుంది. హఠాత్తుగా ఓ రైతు చెట్టెక్కి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఆప్ కార్యకర్తలు అతనిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు.