: 'ప్రేమ ప్రయాణం' నిర్మాత మస్తాన్ వలి ‘ఎర్ర’ స్మగ్లర్... ఎయిర్ పోర్టుల్లో లుకౌట్ నోటీస్!
శేషాచలం ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ తరలింపుపై ఉక్కుపాదం మోపిన సీఐడీ పోలీసులకు పలు విస్తుగొలిపే విషయాలు తెలుస్తున్నాయట. టాలీవుడ్ లో ప్రేమ ప్రయాణం పేరిట సినిమాను తీసిన నిర్మాత మస్తాన్ వలి ఎర్రచందనం స్మగ్లర్ అని పోలీసులు తేల్చారు. ఎర్రచందనం అక్రమ రవాణాతో పోగైన కోట్లాది డబ్బుతో మస్తాన్ వలి సినీ నిర్మాత అవతారమెత్తాడు. తాను తీసిన చిత్రంలో హీరోయిన్ గా నటించిన నీతూ అగర్వాల్ తో సహజీవనం సాగిస్తూ అతడు దర్జాగా విలాస జీవితం గడుపుతున్నాడు. దాదాపు రూ.35 లక్షలు పెట్టి హైదరాబాదులో ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేసిన అతడు దానిని నీతూకు గిఫ్ట్ గా ఇచ్చాడట. తాను తీసిన సినిమా లాభాలనేమీ ఇవ్వకపోవడంతో రూటు మార్చిన మస్తాన్ వలి, ఆ తర్వాత రాజకీయ నేత అవతారం ఎత్తాడు. వైసీపీలో చేరి కర్నూలు జిల్లా చాగలమర్రి ఎంపీపీగా ఎంపికయ్యాడు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతోనే అతడికి కష్టాలు మొదలయ్యాయి. ఇటీవలే ఎర్రచందనం దుంగలను తరలిస్తూ శిరివెళ్ల పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అతడిని విచారించిన సందర్భంగా పోలీసులకు అతడు సినీ నిర్మాత అన్న విషయం తెలిసింది. అయితే ఆ తర్వాత బెయిల్ పై అతడు దర్జాగా బయటకు వచ్చేశాడు. అతడు విదేశాలకు పారిపోకుండా, అన్ని ఎయిర్ పోర్టులకు లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు.