: మీ నాన్నను నీవైనా ఆపు!: మంచిరెడ్డి కుమారుడితో లోకేశ్ భేటీ!


టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలకు చెక్ పెట్టేందుకు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ లో చేరేందుకు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఏ కారణమో తెలియదు కాని, మాధవరం కృష్ణారావు మాత్రం తన యత్నాన్ని విరమించుకున్నారు. టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగానే కాక రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న మంచిరెడ్డి, టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో నిన్న ఆయన తన స్వగ్రామం ఎలిమినేడులోని ఫాంహౌస్ లో కార్యకర్తలతో సుదీర్ఘంగా భేటీ నిర్వహించారు. అదే సమయంలో ఆయన ఫాంహౌస్ వద్ద గులాబీ జెండాలు కూడా దర్శనమిచ్చాయి. కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని భేటీ అనంతరం మంచిరెడ్డి మీడియాకు చెప్పారు. ఓ వైపు ఆ సమావేశం జరుగుతుండగానే, నారా లోకేశ్, మంచిరెడ్డికి ఫోన్ చేశారట. ఓ సారి పార్టీ ఆఫీస్ కు వస్తే మాట్లాడుకుందామంటూ లోకేశ్ అన్నారట. అయితే తాను ఎలిమినేడులో ఉన్నానని, ఇప్పటికిప్పుడు రాలేనని మంచిరెడ్డి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసిన లోకేశ్, ఆయనను పార్టీ కార్యాలయానికి పిలిపించారు. ప్రశాంత్ తో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సుదీర్ఘంగా భేటీ అయిన లోకేశ్, మంచిరెడ్డి యత్నాన్ని విరమించుకునే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారట. ‘‘భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. మీ నాన్నను పార్టీ మారొద్దని చెప్పు’’ అని లోకేశ్, ప్రశాంత్ కు చెప్పారట. తనవంతు యత్నం చేస్తానని ప్రశాంత్ కూడా లోకేశ్ కు హామీ ఇచ్చారట. మరి లోకేశ్ మంత్రాంగం ఫలిస్తుందో, లేదో నేడు తేలిపోనుంది.

  • Loading...

More Telugu News