: నారా లోకేశ్ కు కీలక బాధ్యతలు... టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారట!
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ‘మహానాడు’ పేరిట వచ్చే నెలలో జరగనున్న పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ మేరకు కీలక నిర్ణయం ప్రకటించనున్నారని ప్రస్తుతం పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. 50 లక్షలకు పైగా పార్టీ సభ్యత్వం, కార్యకర్తల సంక్షేమ యాత్రలతో లోకేశ్, పార్టీలో సత్తా చాటుతున్నారు. లోకేశ్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలన్న యత్నాలు గతంలోనే జరిగినా, అవి ఫలించలేదు. తాజాగా లోకేశ్ కూడా పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తుండటంతో పాటు మొన్నటి సభ్యత్వ నమోదును వినూత్న రీతిలో చేపట్టి రికార్డు సభ్యత్వాలను సాధించారు. అంతేకాక ప్రమాదాల్లో మరణించే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించిన తొలి పార్టీగా టీడీపీ అవతరించింది. ఇన్సూరెన్స్ చేయించడం అన్నది కూడా పూర్తిగా లోకేశ్ యోచనే. ఈ క్రమంలో కింది స్థాయి నుంచి లోకేశ్ నాయకత్వంపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. పలువురు కీలక నేతలు లోకేశ్ నాయకత్వాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సాక్షాత్తు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా లోకేశ్ రాగం అందుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే మహానాడులో లోకేశ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.