: ఇదే తొలిసారి... చైనాలో దివాలా దిశగా ప్రభుత్వ సంస్థ
చైనా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ సంస్థ నేడో రేపో దివాలా తీయనుంది. విద్యుత్ రంగంలో సేవలందిస్తున్న బీటీబీఈసీఎల్ (బావోడింగ్ తెయిన్వెయ్ బావోబియన్ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్) దివాలాకు సిద్ధమైంది. గతంలో బాండ్లను విక్రయించి నిధులు సమీకరించిన సంస్థ వాటిపై వడ్డీలను చెల్లించడానికి మంగళవారం ఆఖరి రోజు కాగా, సంస్థ తాజా నిధుల సమీకరణ యత్నాలు విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో బాండ్లపై చెల్లింపులు అసాధ్యమని పేర్కొంటూ, చైనా బాండ్ క్లియరింగ్ హౌస్ అధికారిక వెబ్ సైటులో నోటీసులు ఉంచింది. చైనాలో కాలపరిమితి ముగిసిన బాండ్లపై డబ్బులు చెల్లించలేక దివాలా తీసిన మూడవ లిస్టెడ్ విద్యుత్ కంపెనీగా బీటీబీఈసీఎల్ నిలిచింది. మిగిలిన రెండు సంస్థలూ ప్రైవేటు రంగంలోనివి కాగా, ఈ సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. చైనా ప్రభుత్వం తక్కువ క్వాలిటీ ఉన్న సంస్థలను ఇకపై ఆదుకోరాదని భావిస్తోందని, వీటిని మూసివేయాలనే దిశగా అడుగులు వేస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే, బీటీబీఈసీఎల్ ను అధికారికంగా 'డిఫాల్ట్'గా ప్రకటిస్తే చైనాలో దివాలా తీసిన తొలి ప్రభుత్వ సంస్థ ఇదే అవుతుంది.