: కొడుకైనా, తల్లిదండ్రులైనా బినామీలే!
నల్లధనాన్ని నియంత్రించే దిశగా మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. బినామీ పదం నిర్వచనాన్ని మరింత కఠినం చేయాలని, భార్య, అవివాహిత కుమార్తెల పేరిట ఉన్న ఆస్తులు మినహా మిగతా అందరు సంబంధీకులనూ బినామీ జాబితాలో చేర్చాలని భావిస్తోంది. చివరికి, కొడుకు, తమ్ముడు, చెల్లెలు, తల్లిదండ్రుల పేరిట కొనుగోలు చేసే ఆస్తులూ బినామీలుగానే పరిగణించాలని కేంద్రం ప్రతిపాదించనుంది. లెక్కల్లో చూపని ధనంతో ఈ బంధువర్గం పేరిట ఆస్తులను కొనుగోలు చేస్తే, జైలు ఊచలు లెక్కించే ప్రమాదం అంచున ఉన్నట్టేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు బినామీ చట్టాన్ని సవరించనున్నట్టు పేర్కొన్నారు. ఈ బిల్లు త్వరలోనే కేంద్ర క్యాబినెట్ ముందుకు రానున్నట్టు వివరించారు. 2011లో యూపీఏ ఇదే తరహా బినామీ చట్ట సవరణను పార్లమెంట్ ముందుకు తీసుకురాగా, విపక్షాల అడ్డంకుల కారణంగా బిల్లు ఆమోదం పొందని సంగతి తెలిసిందే.