: భారతీయ రైల్వేల్లో రూ. 4 వేల కోట్ల స్కామ్... రంగంలోకి దిగిన సీబీఐ


ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ను కలిగివున్న భారతీయ రైల్వేల్లో సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని సీబీఐ అనుమానిస్తోంది. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సహాయంతో గణాంకాలు మార్చి అక్రమార్కులు వేల కోట్ల రూపాయలు నొక్కేశారని పసిగట్టిన సీబీఐ రంగంలోకి దిగింది. సరకు రవాణా విషయంలో వాస్తవ బరువును దాచి గూడ్స్ వాగన్ లను నడిపించారన్నది సీబీఐ గుర్తించిన కుంభకోణం. ఈ విషయమై అతి త్వరలో కేసును నమోదు చేయనున్నట్టు సమాచారం. 2012-13లో మొత్తం 100 కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా సరకు రవాణా చేసిన రైల్వేలు మొత్తం రూ. 85,262 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాయి. మొత్తం రైల్వేల ఆదాయంలో ఇది 67 శాతం. సరుకును గూడ్స్ బోగీల్లోకి ఎక్కించే ముందు, మార్గ మధ్యంలో, ఆపై చేరాల్సిన చోటికి చేరిన తరువాత బరువును నమోదు చేయాల్సి వుంటుంది. బోగీల బరువును నిర్దేశిత పరిమితుల్లోనే చూపి అధికంగా లోడ్ చేయడం ద్వారా వీరు కోట్ల రూపాయలు నొక్కేశారని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. అత్యంత అధునాతన పద్ధతులు, సాంకేతికతను వాడుకొని సాఫ్ట్ వేర్ సిస్టమ్ సహాయంతో వీరు తప్పుడు మార్గాల్లో నడిచారని అనుమానిస్తున్నట్టు వివరించారు. ఈ కుంభకోణంలో రైల్వే అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, రవాణా కాంట్రాక్టర్ల ప్రమేయం ఉన్నదని భావిస్తున్నట్టు తెలిపారు. కేవలం 5 శాతం మొత్తాన్ని అధికంగా చూపితేనే రూ. 4,263 కోట్ల వరకూ వీరు నొక్కేసివుండవచ్చని తెలిపారు. వీరి చర్యల వల్ల ఖజానాకు నష్టం వాటిల్లడమే కాకుండా, రైల్వే ట్రాక్ లు, వాగన్ల నాణ్యత దెబ్బతిందని పేర్కొన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించగా, ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News