: బస్సుల ప్రై'వేటు' రూటు!
ప్రైవేటు బస్సులు ప్రయాణికులను మరింతగా దోచుకుంటున్నాయి. తెలంగాణలోకి వచ్చే వాహనాలపై ప్రవేశపన్ను విధించిన తరువాత వారం రోజులు గగ్గోలు పెట్టిన ట్రావెల్ యాజమాన్యాలు నెమ్మదిగా తమ ఆందోళన విరమించాయి. ఆ మేరకు టిక్కెట్ చార్జీలను పెంచి, తాము కూడా మరిన్ని లాభాలను వెనకేసుకోవాలని నిర్ణయించాయి. నాన్ ఏసీ బస్సులలో టిక్కెట్ పై రూ. 50, ఏసీ బస్సులలో రూ. 100 వరకూ పెంచేశారు. వాస్తవానికి 40 సీట్లున్న బస్సులో ప్రతి మూడు నెలలకూ ఒకసారి సీటుకు రూ. 2,625 పన్నుగా చెల్లించాల్సి వుంటుంది. అంటే, సుమారు రూ. 1.10 లక్షల పన్ను భారం వారిపై పడుతుంది. ఈ భారాన్ని ప్రజలపై మోపకతప్పదన్న వాదనతో టిక్కెట్ ధరలను పెంచేశారు. దీంతో నాన్ ఏసీ బస్సులలో రూ. 1.8 లక్షల వరకూ, ఏసీ బస్సులలో రూ. 3.6 లక్షల వరకూ అదనంగా వసూలవుతోంది. ఈ డబ్బులో తెలంగాణ సర్కారుకు వెళ్లేది లక్షా పదివేల రూపాయలే. మిగిలిన డబ్బు ట్రావెల్స్ కు మిగులుతోంది. విద్యార్థులకు పరీక్షలు ముగిసి సెలవులు మొదలైన నేపథ్యంలో ప్రయాణాలు చేసే వారి నుంచి డిమాండ్ ను బట్టి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు మరింతగా వసూలు చేస్తాయని తెలిసిందే.