: వైభవంగా మొదలైన అక్షయ తృతీయ...కిటకిటలాడుతున్న ఆభరణాల దుకాణాలు
బంగారం కొనుగోలుకు శుభదినంగా పరిగణించే అక్షయ తృతీయ పర్వదినాన ఉదయమే ఆభరణాల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ప్రజల సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు జ్యూయలర్స్ రెండు వారాల ముందు నుంచే ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించాయి. ఉత్తరాదిలో ధన త్రయోదశికి ఎంత డిమాండ్ ఉందో దక్షిణాదిన అక్షయ తృతీయకు అంతే డిమాండ్ ఉంటుంది. నేడు బంగారం కొంటే మళ్లీ మళ్లీ కొంటూనే ఉంటామన్న నమ్మకం ప్రజల్లో ఉండడంతో గత వారం రోజుల్లో ధర పెరిగినా, అమ్మకాలు సంతృప్తికరంగానే సాగుతాయని ఆభరణాల దుకాణదారులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పొద్దున్నే 8 గంటలకు దుకాణాలు తెరచుకోగా, షాపుల్లో కొనుగోలుదార్ల సందడి కనిపిస్తోంది. ఇక కస్టమర్లను ఆకర్షించేందుకు ఎంత బంగారం కొంటే, అంత వెండి ఉచితమంటూ, గ్రాముపై రూ. 100 వరకూ తగ్గింపు ఇస్తామని, తయారీ, తరుగులపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తామని నగల దుకాణాలు ఇప్పటికే చాలినంత ప్రచారాన్ని చేసేశాయి. ఇక ఎంతమంది నగల దుకాణాల వైపు వెళ్తారు? మొత్తం ఏ మేరకు అమ్మకాలు జరుగుతాయి? అనే విషయాలు తెలియాల్సి వుంది.