: పరీక్ష హాల్ లో ఎమ్మెల్యే... డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన నకిరేకల్ శాసనసభ్యుడు వీరేశం!
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నిన్న డిగ్రీ పరీక్షా కేంద్రానికి వచ్చారు. పరీక్ష తీరును పరిశీలించేందుకు కాదు, విద్యార్థిగా పరీక్ష రాసేందుకు. గడచిన ఎన్నికల్లో నల్లొండ జిల్లా నకిరేకల్ శాసనసభ్యుడిగా వీరేశం విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే ఆయన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలో రెండేళ్ల కోర్సును పూర్తి చేశారు. తాజాగా మూడో సంవత్సరం పరీక్షలు రాసేందుకు నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కళాశాలలో ఏర్పాటైన పరీక్షా కేంద్రానికి ఆయన వచ్చారు. విద్యార్థులతో కలిసి నేరుగా పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన వీరేశం, మిగతా విద్యార్థులతో కలిసి చక్కగా పరీక్ష రాసేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వీరేశం విద్యార్థిగా పరీక్ష రాస్తున్న విషయం తెలుసుకుని అక్కడి విద్యార్థులు ఆయనతో మాట కలిపేందుకు ఉత్సాహం చూపారు.