: చైనాలో లవ్ మోసగాడు... చివరికి ఇలా దొరికాడు!
ఓ మహిళతో ప్రేమాయణం సాగిస్తూ, మరో మహిళతో ఎఫైర్ నెరుపుతుంటే మోసం అంటారు. మరి, ఏకకాలంలో 17 మందితో డేటింగ్ చేస్తుంటే దాన్నేమనాలి? చైనాలో జరిగిందీ ఉదంతం. చాంగ్ షా ప్రాంతానికి చెందిన యువాన్ అనే యువకుడు ఓ రోజు తన ప్రియురాలి కారులో వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అతడి కుటుంబ సభ్యులు, బంధువుల కోసం ఆసుపత్రి సిబ్బంది ఫోన్లు చేయడంతో యువాన్ బండారం బట్టబయలైంది. అతగాడు 17 మందితో ప్రేమాయణం సాగిస్తున్న వైనం వెల్లడైంది. ఆసుపత్రి సిబ్బంది చేసిన ఫోన్లు అతడి ప్రియురాళ్లకూ చేరాయి. వారందరూ ఆసుపత్రికి వచ్చి, తాము మోసపోయామని గుర్తించి లబోదిబోమన్నారు. వారందరినీ తన ఆర్థిక అవసరాలకు వాడుకున్నాడు యువాన్. ధనికుడినని చెప్పుకుని వారిని వలలో వేసుకుని, ఆపై వారి నుంచి అందినకాడికి దండుకునేవాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.