: అంకిత భావంతోనే ఈ దశకు చేరాడు: ఏచూరి తల్లి కల్పకం


సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎంపికవడంపై ఆయన తల్లి కల్పకం సంతోషం వ్యక్తం చేశారు. వామపక్ష సిద్ధాంతాల పట్ల అంకితభావం ఉన్నందువల్లే తన కుమారుడు ఈ దశకు చేరుకున్నారని అన్నారు. ఏచూరి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పిన ఆమె, తన కుమారుడు ప్రధాన కార్యదర్శిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఏచూరి తల్లి కల్పకం కాకినాడ రామారావు పేటలో నివసిస్తున్నారు. ఇక సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఏచూరి గురించి మరిన్ని విషయాల్లోకి వెళితే, ఆగస్టు 12, 1952లో సర్వేశ్వర సోమయాజి, కల్పకం దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. తండ్రి ఉద్యోగరీత్యా ఏచూరి చదువు హైదరాబాద్, ఢిల్లీల్లో సాగింది. సీబీఎస్ఈ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆయన జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం పొందారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. పట్టా అందుకున్నారు. 1974లో ఎస్ఎఫ్ఐలో చేరిన ఏచూరి, తరువాత జేఎన్ యూలో పీహెచ్ డీ చేస్తుండగా ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయ్యారు. దాంతో ఆయన పీహెచ్ డీ ఆగిపోయింది. అనంతరం ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన 1985లో సీపీఎం కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1992లో పోలిట్ బ్యూరోలో సభ్యుడయ్యారు. 2005 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News