: పెద్దల జోక్యంతో శ్రుతిహాసన్ పై కేసు ఉపసంహరణ!
ఇటీవల పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ పెట్టిన చీటింగ్ కేసులో సినీ నటి శ్రుతిహాసన్ కు ఊరట లభించింది. తమిళ సినీ నిర్మాతల మండలి (టీపీఎఫ్ సీ), దక్షిణ భారత సినీ నటుల సంఘం (ఎస్ఐఏఏ) జోక్యంతో ఆమెపై పెట్టిన కేసును సదరు సంస్థ ఉపసంహరించుకుంది. ఈ వ్యవహారంలో టీపీఎఫ్ సీ అధ్యక్షుడు కలైప్పులి థాను, ఎస్ఐఏఏ అధ్యక్షుడు శరత్ కుమార్ పలువురు పిక్చర్ హౌస్ మీడియా ప్రతినిధులతో చర్చించారు. ఈ క్రమంలో అన్ని విషయాలను పక్కనపెట్టి పరిశ్రమతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్న ఉద్దేశంతోనే శ్రుతిపై పెట్టిన చీటింగ్ కేసును వెనక్కి తీసుకోవాలని ఆ సంస్థ నిర్ణయించుకుందట. అయితే నటీనటులు కూడా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించి నిర్మాణ సంస్థలకు నష్టం కలిగించకూడదని టీపీఎఫ్ సీ, ఎస్ఐఏఏలు స్పష్టం చేశాయి. తెలుగు, తమిళ భాషల్లో నాగార్జున, కార్తీలతో దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందించే చిత్రంలో మొదట్లో కథానాయికగా శ్రుతిహాసన్ ను తీసుకున్నారు. ఇందుకు కుదిరిన ఒప్పందం మేరకు ఆమె షూటింగుకు హాజరుకావల్సి ఉండగా డేట్లు లేవంటూ తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పిక్చర్ హౌస్ సంస్థ హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టుకెక్కిన సంగతి విదితమే!