: నోటికి ప్లాస్టర్ వేసుకున్న పొలార్డ్... అంపైర్ మందలింపునకు వినూత్న నిరసన!
తనను మందలించిన అంపైర్ తీరుకు ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ వినూత్న నిరసన తెలిపాడు. నోటికి ప్లాస్టర్ అంటించుకుని మరీ అతడు వ్యక్తం చేసిన నిరసన నిన్నటి ముంబై-బెంగళూరు మ్యాచ్ లో వివాదాస్పదమైంది. మ్యాచ్ లో భాగంగా బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ తో పొలార్డ్ స్వల్ప వాగ్వివాదానికి దిగాడు. ఈ క్రమంలో అంపైర్ జోక్యం చేసుకుని పొలార్డ్ ను మందలించాడు. దీంతో మనసు నొచ్చుకున్న పొలార్డ్ మ్యాచ్ జరుగుతుండగానే నేరుగా డ్రెస్సింగ్ రూంకు వెళ్లిపోయాడు. కాసేపటికే అతడు నోటికి ప్లాస్టర్ అంటించుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. దీంతో అంపైర్లతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.