: రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందే: బీజేపీ డిమాండ్
కిసాన్ ర్యాలీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఎన్నికల సందర్భంగా పేరున్న వ్యాపారవేత్తలు మోదీకి లోన్లు ఇచ్చారని, గెలిచిన తర్వాత ఆ లోన్లు చెల్లించే క్రమంలో మోదీ శక్తి మేర వ్యాపారవేత్తలకు సహకరిస్తున్నాడని రాహుల్ వ్యాఖ్యానించడం తెలిసిందే. వ్యాపారవేత్తల ధనసాయం వల్లే మోదీ గెలిచారని రాహుల్ అనడం తప్పని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవ పరుస్తున్నాయని మండిపడ్డారు. రాహుల్ దీనిపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించి పెట్టుబడులను ఆకర్షించారని, ఇదే సమయంలో రాహుల్ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలు వ్యవస్థను అవమానపరిచేలా ఉన్నాయని దుయ్యబట్టారు.