: తెలుగు రాష్ట్రాల సీఎంలపై మావోయిస్టు జగన్ ధ్వజం


మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, కె.చంద్రశేఖరరావు ఎన్ కౌంటర్ల పేరిట హత్యాకాండ సాగించారని దుయ్యబట్టారు. ఆలేరు, శేషాచలం ఎన్ కౌంటర్లు బూటకమని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎర్రచందనం స్మగర్లంటూ అమాయక కూలీలను బలిదీసుకున్నాడని మండిపడ్డారు. నియంతృత్వ పోకడలతో కేసీఆర్ సిమీ కార్యకర్తలను చంపించాడని విమర్శించారు. పోలీసులను చంపినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకే ఆలేరు ఎన్ కౌంటర్ చేశారని జగన్ ఆరోపించారు. అణచివేత చర్యలు కొనసాగిస్తే ప్రజాప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు నరహంతకుడైతే, కేసీఆర్ ఓ నియంత అని పేర్కొన్నారు. ఇటీవలే ఏపీలో 20 మంది ఎర్రచందనం కూలీలు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు విడవగా, తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్ లో వికారుద్దీన్ ముఠా హతమవ్వడం తెలిసిందే.

  • Loading...

More Telugu News