: నీళ్లు పోస్తే మంటలు ఆరిపోతాయి... కానీ, ఈ పొయ్యి మండుతుంది!
నీళ్లు చల్లితే మంటలు ఆరిపోతాయన్నది తెలిసిందే. కానీ, కొచ్చి యూనివర్శిటీ పరిశోధకులు మాత్రం నీటితో మంటలు పుట్టిస్తున్నారు. వివరాల్లోకెళితే... వర్శిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన ప్రవీణ్ శ్రీధర్, విమల్ గోపాల్, రిశ్విన్ కొత్త రకం పొయ్యికి రూపకల్పన చేశారు. కొచ్చిలోని స్టార్టప్ విలేజ్ వీరి పరిశోధనలకు వేదిక. ఈ పొయ్యికి ఇంధనం నీరే. నీటిలో రెండు వంతులు హైడ్రోజన్, ఒక వంతు ఆక్సిజన్ ఉంటాయి. ఆక్సిజన్ కు మంటలను ఎక్కువ చేసే లక్షణం ఉంటుంది. ఈ లక్షణమే కొత్త పొయ్యి ఆవిష్కరణకు బాటలు వేసింది. నీటిలోని ఆక్సిజన్ ను విద్యుచ్ఛక్తి సాయంతో విడగొట్టి, ఈ పొయ్యిలో ఇంధనంలా వినియోగిస్తారు. ఓ రకంగా ఇది ఆక్సిజన్ గ్యాస్ స్టవ్ అన్నమాట! ఈ గ్యాస్ పేలిపోయే అవకాశం లేదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. తొలుత వాణిజ్య అవసరాలకు సరిపడే స్టవ్ లు తయారుచేస్తున్నామని, ఆ తర్వాత గృహావసరాలకు తగిన స్టవ్ లు రూపొందిస్తామని ప్రవీణ్ అండ్ కో తెలిపింది.