: మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థంగా ఎత్తిచూపుతాం: ఏచూరి
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరి ప్రజా సమస్యలపై పోరాటమే తమ పంథా అని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న పార్టీ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ... మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థంగా ఎత్తిచూపుతామని ఉద్ఘాటించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని ధీమాగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉందని, వామపక్షాలు బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలు శ్రేణులను చక్కదిద్దుకోవాలని ఏచూరి సూచించారు. ఈ దిశగా తాను కృషిచేస్తానని తెలిపారు. సీపీఎం పార్టీలోని అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తానని పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య తరువాత సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తెలుగు వ్యక్తి ఏచూరే. సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే సీతారాం ఏచూరి నాయకత్వ లక్షణాలతో ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఆయన 1974లో భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ)లో చేరారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 1978లో ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీగా ఎన్నికై సమర్థతను నిరూపించుకున్నారు. 1984లో సీపీఎంలో చేరిన ఏచూరి ఆ మరుసటి ఏడాదే పార్టీ కేంద్ర కమిటీలో చోటు దక్కించుకోవడం విశేషం. 1992లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైన ఆయన, 2005లో రాజ్యసభకు ఎంపికయ్యారు.