: నేను జాతీయ స్థాయి క్రీడాకారుడిని... మాటల దాడి ప్రారంభించిన గల్లా జయదేవ్
ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల్లో మాటల దాడి ప్రారంభమైంది. టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్, గల్లా జయదేవ్ లు అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం ఎవరి యత్నాల్లో వారు తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలో తామిద్దరం ఒకే పార్టీకి చెందిన నేతలమన్న విషయాన్ని వారిద్దరూ మరిచారు. ఇప్పటికే ఈ నెల 4న తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో గల్లా జయదేవ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను గుంటూరు కోర్టు నిలిపేసినా, ఆ తర్వాత మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. అంతేకాక ఆయన ఎన్నికను గుర్తిస్తున్నట్లు భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. అయితే దీనిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని సీఎం రమేశ్, నేటి ఉదయం హైదరాబాదులో ఎన్నికలను ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో అటు ఏపీతో పాటు తెలంగాణ సభ్యులు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో గల్లా జయదేవ్ గళం విప్పారు. అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి తానెవరినీ విమర్శించనని చెప్పిన ఆయన తమదే నిజమైన కార్యవర్గమని ప్రకటించుకున్నారు. అంతేకాక తాను జాతీయ స్థాయి క్రీడాకారుడినని చెప్పుకున్న గల్లా, సీఎం రమేశ్ పేరు ప్రస్తావించకుండానే ఆయన శిబిరంపై విమర్శలు గుప్పించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధానికి తెరలేచినట్లేనన్న వాదన వినిపిస్తోంది.