: కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది... మోదీ సర్కారుపై రాహుల్ ధ్వజం
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భూసేకరణ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కిసాన్ ర్యాలీ వేదికగా రాహుల్, కేంద్రంపై ఒంటికాలిపై లేచారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. అధికారం చేతికందగానే రైతులు, రైతు కూలీలను ప్రధాని నరేంద్ర మోదీ మరిచిపోయారని ఆరోపించారు. ఈ సందర్భంగా యూపీఏ హయాంలో కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలతో పాటు రుణ మాఫీని ఆయన ప్రస్తావించారు. దేశంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూ.70 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. ఆహార భద్రతా చట్టం కింద రైతుల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్ తో దేశంలో రైతులు ఆందోళనలో మునిగిపోయారన్నారు. సర్కారు అసంబద్ధ నిర్ణయాలతో రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదన్న రాహుల్ గాంధీ, రైతుల తరఫున ప్రభుత్వంపై పోరు సాగిస్తామని ప్రకటించారు.